13. అధికార లక్షణం

13. అధికార లక్షణం


            కర్మకాండి భక్తికాండి జ్ఞానకాండియను మువ్వురు అధికారులుందురు.  వారియందు దేహ గృహ కృత్యాదులయందు తాను నేను నాయదియను యహంకార మమకారంబు గల్గునతండె కర్మకాండి యనబడు.  సకల క్రియల నీశ్వరార్పణ జేయునతండు భక్తికాండియననొప్పు.  సర్వ కర్మసాక్షి తాననునతండె జ్ఞానకాండియన వెలయు.  మరియు కర్మి, ముముక్షు, అభ్యాసి, యనుభవ, అరూఢులన విశిష్టాధికారులు పంచవిధులన నుందురు.  వారియందు మూఢత్వంబు చేతనె తనజాతిమాత్ర కర్మంబాచరించి శత జన్మంబునకు ముక్తుండగు నతండెకర్మి.  జగత్తసత్యంబని యెరింగి బాహ్య కర్మనిష్టాగరిష్టుండై జన్మత్రయంబునకు ముక్తుండగునతండు ముముక్షుండనదగు.  స్వప్నంబునుంబోలె ప్రపంచంబు మిథ్యయని తెలిసి అభ్యంతర ధ్యానాది కర్మయుక్తుండై జన్మద్వయంబున ముక్తుండగు నతండు అభ్యాసియనదగు.  వ్యహారంబుపేక్షించి వివేక తత్పరుండై యొక్క జన్మంబున ముక్తుడగు వాడు అనుభవి యనదగు.  విశ్వవికృతి దోచకనె ఆత్మజ్ఞానంబు చేత సద్యోముక్తుండగు నతండారూఢుండు.  మరియు జగంబనెడి కమలవల్లరీ మూలంబెద్దియను విచారంబుచేత శ్రీగురు నాశ్రయించి బ్రహ్మజ్ఞానియై మోక్షంబునొందు నతండొకానొకండు  దేహాదు లనిత్యంబులని తెలిసి భోగాపేక్ష నొల్లక శ్రీగురు నాశ్రయించి తత్త్వజ్ఞానియై మోక్షంబందు నతండొకండు.  మరి శ్రీగురుడు తన శిష్యులకు చెప్పుట విని అకస్మైకముగా తానుజ్ఞానియై నిర్వాణంబునొందు మహాసుకృతశాలియొకండు.  ఇట్లు వివేకవిరక్తులు దైవగతిచే గలిగి ముక్తులగుదురు.  ఈ మువ్వురధికారులని దెల్పిరి.