6. మతాంతరముల జెప్పబడు ఆత్మ లక్షణము, మోక్షము

6. మతాంతరముల జెప్పబడు  ఆత్మ లక్షణము, మోక్షము

            సమస్త మతాంతరంబులందు జెప్పంబడిన నాత్మ స్వరూపంబెట్టిదనిన చార్వాకులు దేహమె ఆత్మయందురు.  చార్వాకైకదేశులు ప్రాణంబె ఆత్మయందురు.  పిదప  దేహాది  విలక్షణుండు  నొక్కయాత్ముండె  దేహపరిమితుండై  మధ్యమ పరమాణుత్వంబుచే సంకోచ వికాస ధర్మ యుక్తుండందురు జైనులు.  బుద్ధియె ఆత్మయందురు బౌద్ధులు.  ఆనందంబె ఆత్మయందురు కౌళయామళ శాక్తేయులు, ఆత్ముండు దేహ పుత్రాది రూపుండందురు లౌకికులు. ఆత్ముండు స్వతఃప్రమాణ జ్ఞాన సమేతుండనువారు మీమాంసక భేధ భాట్టప్రభాకరలనువారు. ఆత్ముండు గగనంబువలె మహత్పరమాణుండై పాషాణంబట్లు జడరూపుండైయ్యు మనస్సంయోగంబుచే చిద్ధర్మయుక్తుండందురు నైయ్యాయికవైశేషికులను వారలు.  ఆత్ముండసంగ చిన్మాత్రుండందురు  సాంఖ్య  పాతంజలులనువారు.   ఆత్ముడు జ్ఞప్తిమాతృండందురు వేదాంతులు.  ఆత్ముండు నిత్యవ్యాపక చైతన్యుండందురు పాశుపత కాపలిక మహావ్రతులనువారు.  ఆత్ముండు నిత్యవ్యాపక జ్ఞానక్రియా రూపుండందురు. మాంత్ర సౌంజ్ఞిక సిద్ధాంతులని పృధక్కరింపందగు.  మరియు నీ సకలవాదులచే చెప్పంబడిన మోక్షంబెట్లనిన మరణమె మోక్షంబందురు చార్వాకులు.  లౌకికాకాశ మధ్యంబున ఉత్తరోత్తరగమనంబె మోక్షంబను వారు జైనులు.  సుఖదుఃఖాదులనంటని శుద్ధబుద్ధి సంసక్తియె మోక్షంబందురు బౌద్ధులు.  ఆకాశ గమనాది సిద్ధిప్రాప్తియె మోక్షంబందురు కౌళయామళులు, ఆనంద ప్రాప్తియె మోక్షంబందురు శాక్తేయులు, వాసుదేవాత్మక ప్రకృతియందు స్వరూప హానిలేక అణగియుండుటె మోక్షంబందురు పాంచరాతృలు.  ఇహపరంబులందు భార్య పుత్రాదులం గూడి వ్యాధ్యాది దుఃంఖంబులేక సుఖంబుగానుండుటె మోక్షంబందురు లౌకికులు. స్వర్గాది పదప్రాప్తియే మోక్షంబందురు పూర్వ మీమాంసకులు.  ఆత్మ శరీరాదికంబులనెడి ఏకవింశతి దుఃఖాత్యంత నాశంబుచే పాషాణప్రాయుండై యుండుటె మోక్షమనువారు న్యాయవైషికులు, ప్రకృతీ పురుష వివేకంబుచేతనె అవిద్యానాశంబందుటె మోక్షంబందురు సాంఖ్యులు.  యోగాభ్యాస బలంబుచే మనోలయద్వారా అజ్ఞానంబుడుగుటె మోక్షంబందురు పాతంజలులు, బ్రహ్మాత్మైకత్వ జ్ఞానంబుచేత వ్యావహారిక బంధనివృత్తియె మోక్షమందురు వేదంతులు, ప్రవాహేశ్వరత్వంబుచేత యీశ్వరత్వంబన్యాధీ నంబుజేశి ఆత్ముండుజ్ఞప్తి మాతృండైయుండెటె మోక్షబందురు పాశుపతులనువారలు. కర్తృత్వంబె సంసారంబగు గావున నిదివిడిచి జ్ఞప్తి మాత్రుండైయుండుటె మోక్షంబందురు కాపాలిక మహావ్రతులు.  ఆత్మునకు షడధ్వాతీత శివ సమానత్వంబె మోక్షంబందురిట్టి సిద్ధాంతులని తెలియంబలికి, మరియు నీ వాదులందు చార్వాకంబైన బౌద్ధమీమాంసక సాంఖ్యులను వారె నిరీశ్వరవాదులు.  తక్కిన వారె యీశ్వరవాదులు.  వేదాంతియొకండె అభేదవాదియై యుండు.