1. వేదశాస్త్రములు

1. వేదశాస్త్రములు
            ప్రథమంబున ముఖ్య ప్రమాణంబులగు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేదంబులే స్వయంభువులని యీశ్వర ప్రణీతంబులని జెప్పదగినవి చతుర్వేదంబులు.  వాటిలో ఋగ్వేదంబు ఏకవింశతి భేదంబు, యజుర్వేదంబు నవాధికశత భేదంబును, సామవేదంబు సహస్ర భేదంబు, అధర్వణవేదంబు పంచాశద్భేదంబైయుండు. వాటియందు విధివాదం బర్దవాందబు మంత్రవాదంబు నామధేయంబులనెడి చదుర్భేదంబులచే సమస్తార్ధంబులు బోధింపబడుచుండు. వాటియందు రాజాజ్ఞవలెనే పురుషుల దుష్కృతంబులను విడిపించి ధర్మమే చేయతగ్గది యని నియమించునది విధివాదంబు. వందిజనంబుల కైవడి అవిద్యార్ధంబులు కొనియాడునది అర్ధవాదంబు. ఆచార్యుని చందంబున చేయతగినది చెప్పునది మంత్రవాదంబు. జననీ జనకుల తెరంగున యాగాదులకు నామంబు లిడినవే నామధేయంబులన దగు.  మరియు నావేదంబునకు అవి పాద హస్త ముఖ ఘ్రాణ నేత్ర శ్రోత్రంబులయినవి, క్రమంబుగా ఛందస్సును, కల్పంబును, వ్యాకరణంబు, శిక్షయు, జ్యోతిషంబును, నిరుక్తమనదగినవే షడంగములు.  వాటిలో ఛందస్సు మంత్రాదులకు, త్వష్టువు మొదలయిన ఛందంబులచేత నక్షర గణంబుల జేయును.  కల్పమే ఆశ్రాయణియ్య, బోధాయనియ్య, ఆపస్తంభియ్య సూత్ర రూపంబులచే యజ్ఞ ప్రయోగాదుల జెప్పును.  వ్యాకరణంబు వైదిక శబ్దస్ధితిని సమర్ధించును. శిక్షయనునది ఉదాత్తానుదాత్తస్వరిత ప్రచయంబులననెడి చతుర్విధ స్వరకారణ పూర్వకంబుగా పద పాఠ క్రమంబుచే వేదాధ్యయనాదులను వివరించును.  జ్యోతిషంబు లగ్న తిధి నక్షత్ర యోగ కరణంబులచేత వైదిక కర్మంబులకు కాలంబుల దెలుపును.  నిరుక్తము వైదిక శబ్ద నిర్వచనంబు చేయుచు నియమింపుచుండును.  అనంతరంబున, మీమాంస న్యాయశాస్త్ర పురాణ స్మృతులన దగిన నాల్గు వేదంబుల కుపాంగంబులు. వీటి లక్షణంబులు ముందర జెప్పంబడును.  పిదప ఆయుర్వేద, అర్ధవేద, ధనుర్వేద, గాంధర్వ వేదంబు లనదగినవి నాలుగు ఉపవేదంబులు.  వాటియందు ఆయుర్వేదంబు వ్యాధి నిదాన, వ్యాధి చిహ్న, మంత్రౌషధ చికిత్సలచేత ఆయురారోగ్యాదుల జూపును.  అర్ధవేదంబు దక్షిణాజ్యచరూప హారాదులం జెప్పును. కావున, ధర్మాది చదుర్వర్గ సాధనంబై యుండు ధనుర్వేదంబు శత్రుజయార్ధంబుగా మంత్రాస్త్ర  ప్రయోగాదుల  దెలుపు.  గాంధర్వ వేదంబె సామవేదాదులలో
స రి గ మ ప ద ని అనునట్టి సప్తస్వర గీత ప్రబంధంబులను విభాగించుచుండును.  అనంతరంబున శ్రీరుద్ర, బృహదారణ్య  కైవల్య, కాలాగ్ని, కఠవల్లి, కాత్యాయన, బ్రహ్మ, నారాయణ, హంస, పరమహంస, భాష్కళ, బ్రహ్మబిందు, ఆరుణి, అమృతబిందు, చర్చ, పంచబ్రహ్మ, జాబాలా, తేజోబిందు, వాజసనీయ, బోధాయనీయ్య, అశ్రాయణియ్య, మైత్రాయణియ్య, సాంఖ్యాయనీయ్య, వాసురాయణియ్య, శౌనకియ్య, శివసంకల్ప, శ్రవణ, పరాక్రమ, ప్రోజ్య, ముద్గల, ముండకంబులనునవి ఉపనిషత్తులు.  వాటియందు జ్ఞానాంగంబులైన భస్మ, రుద్రాక్షాదులను, బ్రహ్మజ్ఞానంబును వివరింపబడుచుండు.  అనంతరంబున మనుస్మృతి, అత్రిస్మృతి, హరితస్మృతి, విష్ణుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ఉశనస్మృతి అంగీరసస్మృతి, యమస్మృతి, ఆపస్తంభస్మృతి, సంవర్తస్మృతి, కాత్యాయనస్మృతి, బృహస్పతిస్మృతి, పరాశరస్మృతి, వ్యాసస్మృతి, శంఖలిఖితస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, శౄతాతపస్మృతి, వసిష్ఠస్మృతులన దగినవే ఆయా నామధేయంబులు గలవారి  చేత చెప్పండిన యేకోన వింశతి ధర్మశాస్త్రంబులు.  వాటియందు కృతయుగంబున మనుస్మృతి ధర్మంబై ముఖ్యమైయుండు, త్రేతాయుగంబునందు గౌతమస్మృతి ధర్మంబై ముఖ్యమైయుండు.  ద్వాపరంబున శంఖలిఖితస్మృతి ధర్మంబై ముఖ్యమైయుండు, కలిగియుగంబున పరాశరస్మృతి ధర్మంబై ముఖ్యమైయుండు.  స్మృతులయందు జాతివర్ణాశ్రమాచారంబులును దాయాదవిభాగాది అష్టాదశ వ్యవహార భేదంబులను మహాపాతకాదులకు ప్రాయశ్చిత్తాదులును విధింపబడును.