7. చదుర్దశవిద్యలు

7. చదుర్దశవిద్యలు

            ఇట్లు జెప్పిన సకల శాస్త్రంబులందు వేదంబులు నాల్గు, వేదాంగంబులారు, న్యాయమీమాంసంబులు రెండుస్మృతి పురాణంబులు రెండు గూడి చతుర్దశవిద్యలని జెప్పంబడు. వాటియందు  మీమాంసయను నదొక్కటె మరీ విశేష్యమయి వింశత్వాధ్యాయ మనంబడి కర్మార్థ ప్రతిపాదకత్వంబుచే తద్విభాగంబై యుండు, దానియందు మొదటి భాగంబె జైమిని సూత్రరూపంబై ద్వాదశాధ్యాయ మనదగి కర్మ కర్తృ ప్రతిపాదకంబై లోక వేదాధికరణమనెడి మొదలయిన శాస్త్ర న్యాయంబులచె పూర్వ మీమాంసయనబడు.  నా జైమిని సూత్రంబునకు శాబరంబను భాష్యంబు చేయంబడియె.
            మరి యామీమాంస శాస్త్రంబునకు భట్టాచార్యులచాత వార్తీ కరూపంబుగా భాట్టిమని యొక మతాంతరంబు రచితంబయ్యె, మరియు భట్టాచార్యుల శిష్యుడైన ప్రభాకరుడను గురుని చాతను శాబర భాష్యంబునకు ప్రభాకరమని యొకమతాంతరంబు చేయబడియె.
            మరియు రెండోదైన భాగంబె బ్రహ్మార్థ ప్రతిపాదకంబు చేత ఉత్తర మీమాంసయనదగి వ్యాససూత్ర రూపంబుచె అష్టాధ్యాయంబైయుండు. దానియందు పూర్వమైన నాల్గధ్యాయంబులె దేవతాకాండ మనిపించి యుండు.

            దానిలో మంత్రవాదంబట్లు దేవతాలక్షణంబె బలభద్రరామునిచే ప్రతిపాదింపబడి ఏతదుత్తరంబైన నాల్గధ్యాయంబులు బ్రహ్మకాండమనబడు.  దానికి బ్రహ్మాత్త్మైక ప్రతిపాదకంబుగా శ్రీమచ్ఛంక్కర భగవత్పాదులచేత భాష్యంబు చేయంబడియె.  పిదప భాష్యంబునకు వివరణాచార్యుల చేత వివరణంబు చేయంబడియె.  మరియు నావివరణంబె వేదాంత శాస్త్రంబని యెరుంగదగు.  అనంతరంబున వేదాంత శాస్త్ర విచారంబెట్లనిన ఆశీర్వాద నమస్కారవస్తునిర్ధేశంబులనునివె శాస్త్రారంభంబునందు చేయందగిన మంగళా చరణంబులు.