30. ఈశ్వర నామరూప వ్యవహారం

30. ఈశ్వర నామరూప వ్యవహారం

            ఈశ్వరుండె విరాట్పురుష, హిరణ్యగర్భ, అంతర్యాములని త్రివిఢుండై యుండు.  వానిలో స్థూల శరీర సమష్ట్యభిమాని, వైశ్వానరుండను నిదియాదిగా గల్గినవె విరాట్పురుషుని పర్యాయ నామంబులు.  లింగశరీర సమష్ట్యభిమాని, మహాప్రాణుండు, సూత్రాత్మకుండను నివి మొదలయినవె హిరణ్యగర్భుని పర్యాయ నామంబులు.  కారణశరీర సమష్ట్యభిమాని, అజ్ఞానోపహి తచైతన్యుండు, కారణోపాధికుండు, మాయోపాధికుండు, మాయాభాసుండు, మాయావి, జగద్యోని, ఆనందమయుండు, అక్షరుండు, అవ్యక్తుండు, అవ్యాకృతుండు, శబల బ్రహ్మంబు, సగుణ బ్రహ్మంబు, పరముండు, పరదేవతతత్పద ముఖ్యార్థుండను నివి మొదలయినవె అంతర్యామి పర్యాయ నామంబులు.  ఈశ్వరుని త్రివిధత్వంబునందు దృష్టాంతంబెట్లనిన, ఎట్లు చిత్రపటంబు  ద్రవ్యాంతర    సంబంధంబు  లేకయుండ  తానె ధౌతమనిపించుకొను చరిచేత ననులేపనంబుగావించిన ఘట్టితంబనబడు.  నీలీమయాకృతులచె లాంఛితమనదగు. పిదప యధాయోగ్యంబైన వర్ణ పూరణంబులచేత రంజితమనదగు.  అట్లు పరబ్రహ్మంబు మొదలు మాయా తత్కార్య రహితుండనునతండె చిత్తన వెలుంగుచుండు.
            మరియు సర్వ కారణంబైన మాయోపాధిచేత అంతర్యామి యనుపించుకొనును.  అవ్యక్తంబై అపంచీకృత భూతకార్యంబైన సూక్ష్మసమష్ట్యు పాధిచె సూత్రాత్మకుం డనిపించుకొనును.  పిదప వ్యక్తంబైన పంచీకరింపంబడిన భూతకార్యరూప స్థూలశరీర సమష్ట్యుపాధిచె విరాట్టనుపించుకొనును.  మరి యిచట బ్రహ్మంబునకు చిత్రపట దృష్టాంతంబు చెప్ప చిత్రంబులేవేవనిన విరించ్యాది తృణాంతంబగు చేతన ప్రాణులును గిరి నద్యా ద్యచేతన విషయంబులైన జడాజడ రూపంబగు జగత్తె చిత్ర దృష్టాంతంబగు.  మరియు పారమార్థికంబైన చిద్రూపాద్వయ బ్రహ్మంబునందు మిథ్యాత్మక బహు చేతనాచేతన జగత్తుదోచు టెట్లనిన యట్లు చిత్రంబులో వ్రాయంబడిన మనుష్యులు కట్టికప్పిన నానావర్ణోపేతంబైన శీతాదినివృత్తిని చేయ నసమర్ధంబైన వస్త్రాభాసంబులు ఏకాకారమైన శీతాది పరిహారకంబై తథ్యంబైన ఆ యాధార పటంబుతో సదృశంబులైయుండు. ఆ చిత్రంబునంగల గిరి నద్యాదులకా చిత్రాధారపటంబుతోడ పోలిక ఘటింపనేరదు.  ఆ విధంబుననే చిద్రూప బ్రహ్మంబునందు భిన్న భిన్నంబుగా దోచుచుండెడి వ్యావహారిక జీవులె చిత్తునందు పోలికెగలిగి చిదాభాస చేతనలనబడిరి.  చిత్తునందు పోలికె ఘటించని మృత్తిక మొదలైనవె జడరూపంబు లౌటచెత చేతనా చేత నాత్మకజగత్తు చిద్రూప బ్రహ్మంబునందె కల్పితంబని తెలియంబలికె.