5. వైదికశాస్త్రములు

5. వైదికశాస్త్రములు

            శక్తితత్వ్తవాసియగు నొకానొక యాత్మ చేతను వాసుదేవుని చేతను క్రమంబుగా జెప్పంబడిన శాక్తేయపాంచరాత్రంబులను నివిప్రత్యేక శాస్త్రంబులు. వాటియందు శాక్తేయంబు జడాజడ ప్రపంచంబంతయు శక్తిపరిణామంబను నివి మొదలైనవి వివరింపబడుచుండును.  పాంచరాత్రంబు పృథివ్యాది మానసాంతముగా గల చతుర్వింశతి తత్త్వంబులను, మీద గుణతత్త్వాత్మక వాసుదేవునిచే జగదుద్ధితార్ధంబుగా కృష్ణా, అనిరుద్ధ, మకరధ్వజ, రౌహిణేయులను నలువురుత్పత్తి మొదలైనవి జెప్పంబడును.  మరియు లౌకిక, వైదిక, ఆధ్యాత్మిక, అతిమూర్థిక, మాత్రంబులను నివి పంచవిధ శాస్త్రంబులు.  వీటియందు లౌకికంబెట్లనిన ధన్వంతర్యాదుల చేత నుక్తంబైన ఆయుర్వేదంబు దండనీతి మొదలైన దృష్టఫలంబుల జెప్పును.  మరియు  జైమిని అక్షపాదకాదులను ఋషీశ్వరులచే క్రమంబుగా  జెప్పండిన పూర్వమీమాంస న్యాయవైషికంబులను దృష్టాదృష్ట ఫలంబులు గల యవి వైదిక శాస్త్రంబులు.  వాటియందు పూర్వ మీమాంస ఉపక్రమాది షడ్విధలింగ తాత్పర్యంబులచేత వేద వాక్య విచారణ పూర్వకంబుగా జ్యోతిష్టోమ యాగాదుల క్రమంబుగా వివరించును.  న్యాయంబు, ప్రమాణ, ప్రమేయ, సంశయ, ప్రయోజన, దృష్టాంత, సిద్ధాంత, అవయవ, తర్క, వాద, జల్పవితండ, హేత్వా, భాస, ఛల, జాతి, నిగ్రహ స్థానంబులనెడి షోడశ పదార్ధంబులం జెప్పుచు ప్రపంచంబున కీశ్వర కర్తృకత్వంబును సాధించు.  వైశేషికంబు ద్రవ్యగుణకర్మ సామాన్య విశేష సమవాయంబులను షట్పదార్ధంబుల ప్రతిపాదనంబుచే ప్రపంచ స్వరూపంబు విభాగింపుచుండు.  అనంతరంబున కపిల, పతంజలి, వ్యాసులను, మునులచే గ్రమంబుగా జెప్పంబడిన సాంఖ్య, పాతంజలి, వేదాంతంబులను నాత్మజ్ఞాన ఫలంబుగా గల అధ్యాత్మ శాస్త్రంబులు.  వాటియందు సాంఖ్యంబు నిత్యనిర్మలులయిన ఆత్ముల సన్నిధానంబుచే గుణత్రయాత్మీక ప్రకృతీయనదగిన పంచవింశతి తత్త్వాత్మక ప్రపంచ రూపంబుగా వ్యవహరించుటె సంసార బంధనంబనియును సత్వాది గుణత్రయాను క్రమంబుచే శ్లేష్మప్రకృతి వాతప్రకృతి పిత్తప్రకృతులు గల శాంతి క్రోధ మూఢతాది గుణులైన ఉత్తమ, మధ్యమ అధమపురుషుల వర్ణరీతుల మొదలుగాగల క్రమంబు లెరింగించు.  పాతంజాలంబున యమాద్యష్టాంగ యోగంబుచేత మనో నిశ్చలత్వంబు సిద్ధించునని చెప్పుచుండు, ఉత్తరమీమాంసయు ఉపనిషదర్థ ప్రతిపాదకంబైన వేదాంత శాస్త్రంబందె ప్రపంచంబునకు మిథ్యాత్వంబు సాధించుట వల్ల బ్రహ్మైక్యమునె వర్ణించును.  భాస్కరీయ్య, మాయావాద, శబ్దబ్రహ్మవాద, క్రియాబ్రహ్మ వాదంబులను నాలుగు తెరంగులయి యుండు.  అనంతరంబున మాయాతత్త్వ, విద్యాతత్త్వ, కాలతత్త్వ, వాసులయిన త్రిరుదృలచేత విరచితంబైన పాశుపత, కాపాలిక, మహావ్రతములను నివి అతి మార్శిక శాస్త్రంబులు.  వాటియందు పాశుపతంబు మాయాకార్యంబులను పాశద్వయంబులను చెప్పుచుండు, కాపాలికంబు నరకపాల భిక్షాటనంబుల వర్ణించును.  మహావ్రతంబె ఆస్తి ధారణాదుల వర్ణింపుచుండు.  మరియు పరశివ ప్రణీతంబైన మాత్రంబే మోక్షాంగంబైన క్రియాచార యోగజ్ఞానంబుల వర్ణింపుచుండు.