21. ఆత్మస్వరూప పంచలక్షణం

21. ఆత్మస్వరూప పంచలక్షణం

            సత్తు చిత్తు ఆనంద నిత్య పరిపూర్ణంబులనునివె యాత్ముని స్వరూప లక్షణంబులు.  వాటియందు యెరుగుదు, నెరుంగనెరింగితి యనునప్పుడు కామాదివృత్తులు దోచునప్పుడు దిక్కుతోచకుండు నప్పుడును జాగ్రతాద్యవస్థలయందున్ను తనకొక్క బాధయు లేక యుండుటె సద్రూపంబగు.  సప్తావస్తలయందు విషయంబుల నెదుర్కొని దృశ్యంబుగా జూచినది చిద్రూపంబగు.  పరమ ప్రీతికి విషయమై యుండునదె ఆనంద రూపంబగు.  సతతోదితమై యుండినదె నిత్యరూపంబగు. సర్వార్థ సాధకంబగుటచేతను సర్వ సంబంద్ధిత్వంబె పూర్ణరూపంబగును.

            మరియు నీయర్థంబున సచ్చిదానందంబు లాత్మస్వరూపంబులై యుండ సద్రూప చిద్రూపంబులట్ల సర్వబుద్ధి వృత్తులయందును ఆనంద రూపంబునకు అభివ్యక్తి గలుగవలయునది లేదుగావున ఆనందంబాత్మ స్వరూపంబు గాదను శంకకు ఉష్ణప్రకాశ రూపంబగు దీపంబు యొక్క ప్రకాశంబె గృహంబునను వ్యాపించు వుష్ణంబు వ్యాపకంబుగానేరదు.  వుదకంబున వుష్ణంబె ప్రకటమగుచుండు ప్రకాశంబునకు ప్రకటంబులేదు. కాష్టంబునందు వుష్ణ ప్రకాశంబులు రెండు గలుగు టెట్లట్లు పాషాణాదులయందు బ్రహ్మయొక్క సద్రూపంబున కభివ్యక్తి గలదు. చిదానందంబుల కభివ్యక్తి గానేరదు.  బుద్ధియొక్క తమోగుణంబుచే అజ్ఞానమయంబగు మూఢవృత్తి యందును రజోగుణంబుచే రాగమయంబగు ఘాెరవృత్తి యందును సచ్చిద్రూపంబులనెడి రెంటికి స్పష్టత్వంబుగాని ఆనంద రూపంబునకు స్పష్టత్వంబు గలుగనేరదు, సత్వ గుణంబుచె వైరాగ్యమయంబైన శాంత వృత్తి యందె సచ్చిదానందంబులను త్రిరూపంబులకు స్ఫురణ గలుగు గావున ఆనందంబాత్మ స్వరూపంబనుట సిద్ధంబు.