44. ఇంద్రియములు

44.  ఇంద్రియములు


            మానసాద్యంతఃకరణంబులకు క్రమంబుగా విషయంబుల తలంచుట, నిశ్చయించుట, అభిమానించుట, అవధరించుట యనుటె వ్యాపారంబులు.  చంద్ర, చతుర్ముఖ, క్షేత్రజ్ఞ, త్రిపురాంతకులె అధి దేవతలు హృదయాది గోళకంబులె స్థానంబులు.  శ్రోత్రాది జ్ఞానేంద్రియంబులకు క్రమంబుగా శబ్ధాది విషయంబుల వినుట సోకుట, రుచించుట, వాసనగొనుటలె వ్యాపారంబులు.  దిక్‌, మారుత, మిత్ర, వరుణ, అశ్వినులె అధి దేవతలు.  కణాదిగోళకంబులె స్థానంబులు. శ్రోత్రాదీంద్రియములకు బాహ్యంబుల యందు విషయంబుల గ్రహించునట్ల అంగుళిచేత శ్రోత్రంబులు మూయగా ప్రాణవాయువు జఠరాగ్ని యందు గల శబ్ద గ్రహణంబును, నేత్రంబులు మూయగా లోపలి యంధకార రూపంబు గ్రహించుటయు, అన్నపాన స్వీకారముల యందు ఉష్ణ శీతస్పర్శనంబున గ్రహణంబును, ఉద్గారణంబై నపుడు రసగంధ గ్రహణంబును, అంతర శబ్దాది విషయ గ్రహణంబులు గలదనుటె సిద్ధంబు.  మరియు వాగాది కర్మేంద్రియంబులకు క్రమంబుగా పలుకుట, పట్టుట, నడచుట, విడచుట, ఆనందంబు బుట్టించుట యనునవి యీ వ్యాపారంబులు.  అగ్ని, ఇంద్ర, హరి, మృత్యు, ప్రజేశ్వరులనువా రధిదేవతలు.  ముఖాది గోళకంబులె స్థానంబులగు.  అంతఃకరణ జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబులను నివి చతుర్థశ ఆధ్యాత్మికంబులు. వాటి విషయంబులె అధి భౌతికంబులు. వాటి యధిదేవతలె ఆధి దైవతంబులని తెలియందగు.  మరియు నింద్రియాది దైవతంబులె విరాట్పురుషుని ఇంద్రియంబులు. ఆ ఇంద్రియంబులె హిరణ్య గర్భునిశరీరంబు. ఆ శరీరంబే తమో రూపంబై అంతర్యామియై కారణంబైయుండు.